Narendra Modi: మోదీ ‘పరీక్షాపే చర్చ’: లక్ష్మణ్, ద్రవిడ్, కుంబ్లే ఆటను మర్చిపోలేమన్న ప్రధాని
- వార్షిక పరీక్షలు దగ్గరపడుతుండడంతో విద్యార్థులతో మోదీ ముఖాముఖి
- ఈడెన్‌లో ఇండియా-ఆసీస్ టెస్టును గుర్తు చేసిన ప్రధాని
- ఇటువంటి ఘటనల నుంచి స్ఫూర్తిపొందాలని పిలుపు
టీమిండియా మాజీ ఆటగాళ్లు లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలు స్ఫూర్తి ప్రదాతలని, వారి ఆట మనల్ని ఉత్తేజితం చేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తుండడంతో నిన్న ఆయన ‘పరీక్షాపే చర్చ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2001లో భారత్-ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన టెస్టును ఉదహరించారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఫాలో ఆన్‌లో పడింది.
రెండో ఇన్నింగ్స్‌లో క్రీజులో పాతుకుపోయిన లక్ష్మణ్ (281), ద్రవిడ్ (180) అద్భుతంగా ఆడి జట్టుకు చారిత్రక విజయాన్ని అందించారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆటగాళ్ల మూడ్ కూడా బాగోలేదని, అలాంటి సమయంలో లక్ష్మణ్, ద్రవిడ్‌లు ఆడిన ఇన్నింగ్స్ చిరస్మరణీయమని మోదీ అన్నారు. ఆ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేమని, మ్యాచ్‌ను తిప్పేశారని గుర్తు చేశారు. అలాగే, 2002లో విండీస్‌తో అంటిగ్వాలో జరిగిన టెస్టులో గాయపడినప్పటికీ కుంబ్లే బౌలింగ్ చేశాడని, ఇలాంటి ఘటనలు మనలో ఉత్తేజాన్ని నింపుతాయని మోదీ పేర్కొన్నారు. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే ఇలాంటి ఘటనల నుంచి మనం స్ఫూర్తిపొందాలని విద్యార్థులకు మోదీ సూచించారు.