Malaysia: మేము చిన్న వాళ్లం.. భారత్ పై ప్రతీకారం తీర్చుకోలేం: మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్

  • కశ్మీర్ ను ఆక్రమిత  ప్రాంతమన్న మలేషియా ప్రధాని
  • మలేషియా నుంచి పామాయిల్ దిగుమతుల నిలిపివేత
  • ప్రత్యామ్నాయంకోసం మలేషియా అన్వేషణ

తాము ఎగుమతి చేసే పామాయిల్ ను కొనడం నిలిపివేసిన భారత్ పై ప్రతీకారం తీసుకునేంత శక్తిమంతమైన దేశం తమది కాదని మలేషియా ప్రధానమంత్రి మహతీర్ మహ్మద్ అన్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కశ్మీర్ ను ఆక్రమిత  ప్రాంతంగా మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ పేర్కొన్నారు.  అంతేకాక కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని కూడా మహతీర్ వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంలో భారత్ ఆ దేశం నుంచి భారీ స్థాయిలో దిగుమతి చేసుకుంటున్న పామాయిల్ ను నిలిపివేసింది. దీంతో మలేషియా ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. భారత్ నిర్ణయంతో మలేషియా ఎగుమతులు పదిశాతం పడిపోయాయి. ఆ దేశం కొత్త దిగుమతిదారులకోసం ఎదురుచూస్తోంది.

ఈ నేపథ్యంలో మహతీర్ మహ్మద్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. భారత్ పై ప్రతీకార చర్యలకు దిగే స్థాయి తమకు లేదన్నారు. ‘మేం చాలా చిన్నవాళ్లం. ప్రతీకారం తీర్చుకోలేము. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాము. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాము’ అని చెప్పారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ దిగుమతుల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉందన్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News