Tulasi Reddy: జగన్ నాటువైద్యుడి కంటే అధ్వానంగా తయారయ్యాడు... పిచ్చి రెడ్డిగా చరిత్రలో నిలిచిపోతాడు: తులసిరెడ్డి

  • జగన్ పై తులసిరెడ్డి విమర్శలు
  • మూడు రాజధానుల ప్రయోగం విఫలమవుతుందని వ్యాఖ్యలు
  • వైసీపీ సర్కారు పతనం తథ్యమని వెల్లడి

ఏపీ సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల ప్రయోగం వికటించడం ఖాయమని, వైసీపీ సర్కారు పతనం కావడం తథ్యమని అన్నారు. తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ ప్రాంతం న్యాయ రాజధానిగా మారదని స్పష్టం చేశారు.

"పిచ్చోడి చేతిలో రాయి అనేది సామెతగా వాడతాం, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే పిచ్చోడి చేతిలో ఏకే-47 అనాలి! హైకోర్టు ఉన్నంత మాత్రాన రాజధాని అవదు. హైకోర్టు అంటే హైకోర్టే. హైకోర్టుకు సంబంధించి జగన్ చేతుల్లో ఏమీ లేదు. ప్రతిపాదన చేయడం వరకే ఆయన పని. ఇక వికేంద్రీకరణ అంటున్నాడు... చట్టంలో పేర్కొన్న వికేంద్రీకరణకు మించి కొత్తగా ఏంచేయగలడు? అప్పట్లో సినీ రంగాన్ని చెన్నై నుంచి హైదరాబాద్ కు తెప్పించారు. చేతనైతే హైదరాబాద్ నుంచి తెలుగు సినీ రంగాన్ని విశాఖకు తెప్పించు. టూరిజం క్యాపిటల్ గా, ఐటీ క్యాపిటల్ గా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది.

ప్రత్యేక హోదా తెప్పించకుండా, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా మరేదో చేయడం సరికాదు. పంటి నొప్పి వస్తే పంటికే వైద్యం చేయాలి. పంటి నొప్పికి తుంటికి వైద్యం చేస్తే అటు పన్ను పోతుంది, ఇటు తుంటి విరిగిపోతుంది. జగన్ తానేదో పెద్ద స్పెషలిస్ట్ అనుకుంటున్నాడు కానీ ఆఖరికి నాటువైద్యుడి కంటే అధ్వానంగా తయారయ్యాడు.

ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్ కు మార్చాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో దౌలతాబాద్ చేరేసరికి 2 లక్షల మంది ప్రజలు చనిపోయారు. అతని ఆలోచన విఫలమైంది. దాంతో మళ్లీ రాజధానిని దౌలతాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాడు. ఈసారి కూడా మరో 2 లక్షల మంది చనిపోయారు. పర్యవసానంగా రాజ్యం పతనమైపోయింది.

 ఏడు శతాబ్దాలుగా మహ్మద్ బిన్ తుగ్లక్ ను పిచ్చి తుగ్లక్ గా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు జగన్ కు జరగబోయేది కూడా ఇదే. అతను కచ్చితంగా విఫలమవడమే కాదు, పదవిని కూడా కోల్పోతాడు. జగన్ మోహన్ రెడ్డి బదులు పిచ్చిరెడ్డిగా చరిత్రలో నిలిచిపోతాడు... ఈ లోపల రాష్ట్రం నాశనమైపోతుంది" అంటూ తులసిరెడ్డి విశ్లేషించారు.

Tulasi Reddy
Jagan
Andhra Pradesh
Amaravati
Vizag
Congress
YSRCP
AP Capital
  • Loading...

More Telugu News