Janasena: సీఆర్డీఏ బిల్లు రద్దుకు ‘జనసేన’ తరఫున మద్దతు తెలుపుతున్నా: ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

  • అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నాం
  • మూడు రాజధానుల అంశంపై ఎవరికీ వ్యతిరేకత లేదు
  • టీడీపీ నేత రామానాయుడుకు కూడా ఇష్టమే

అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి అంతా ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో రాష్ట్ర పునర్విభజన తర్వాత తెలిసిందని, అందుకే, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ చేసే ప్రతిదానిని వ్యతిరేకించడం కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై ప్రజాభిప్రాయం సేకరించాలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాపాక ప్రస్తావించారు.

రామానాయుడు చెప్పినట్టుగా ప్రజాభిప్రాయం సేకరిస్తే అసలు విషయం తెలుస్తుందని, మూడు రాజధానులకు ఎవరూ వ్యతిరేకంగా లేరని, అందరూ అనుకూలంగానే ఉన్నారని అభిప్రాయపడ్డారు. ప్రజల అభిప్రాయమే తమ అభిప్రాయమని, యావత్తు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంలో ప్రజలు ఉన్నారని చెప్పారు. మూడు రాజధానులు వద్దని ప్రతిపక్షంలో ఉన్న రామానాయుడు మాట్లాడాలి కనుక మాట్లాడుతున్నారే తప్ప, నిజంగా అయితే ఆయనకు కూడా ఇష్టమేనని వ్యాఖ్యానించారు. సీఆర్డీఏ బిల్లు రద్దుకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నానని, యువ ముఖ్యమంత్రి జగన్ ని అభినందిస్తున్నానని అన్నారు.

Janasena
Mla
Rapaka Vara Prasad
cm
Jagan
  • Error fetching data: Network response was not ok

More Telugu News