Vizag: 17 టన్నులు, రెండు వార్ హెడ్లు... ఒకేసారి రెండు లక్ష్యాల ఛేదన.. డీఆర్డీవో ప్రయోగం సక్సెస్!
- కే-4 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం
- విశాఖ నుంచి ప్రయోగించిన డీఆర్డీఓ
- అత్యంత కచ్చితత్వంతో ఛేదన
రెండుసార్లు విఫలమైన తరువాత, కే-4 బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాన్ని అధికారులు విజయవంతం చేశారు. 17 టన్నుల బరువుతో ఉండే ఈ క్షిపణి, రెండు వార్ హెడ్లను 3,500 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, లక్ష్యాలపై వేస్తుంది. ఆదివారం నాడు విశాఖపట్నం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. సముద్రంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి ఛేదించడం గమనార్హం.
అణు జలాంతర్గామి నుంచి కూడా దీన్ని ప్రయోగించ వచ్చని క్షిపణిని అభివృద్ధి చేసిన డీఆర్డీవో తెలిపింది. దీన్ని అత్యంత ఆధునిక ఐఎన్ఎస్ అరిహంత్ సబ్ మెరైన్ కు అమర్చేలా తయారు చేశామని పేర్కొంది. వాస్తవానికి గత నవంబర్ లోనే దీని ప్రయోగం జరగాల్సి వుండగా, అప్పట్లో బుల్ బుల్ తుపాన్ కారణంగా ప్రయోగం వాయిదా పడింది.
తాజాగా, క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డీఆర్డీఓ అధికారులను అభినందించారు. ఏపీ తీరం నుంచి క్షిపణిని ప్రయోగించడం, అది విజయవంతం కావడం గర్వకారణమని అన్నారు. భవిష్యత్తులో డీఆర్డీఓ మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.