Uttarakhand: రైల్వే ప్లాట్ ఫామ్స్ పై ఉర్దూకు బదులుగా సంస్కృతం

  • సైన్ బోర్డులను మారుస్తున్న ఉత్తరాఖండ్ రైల్వే అధికారులు
  • నిబంధనల ప్రకారం హిందీ, ఇంగ్లీష్ తో పాటు రాష్ట్ర ద్వితీయ భాషకు స్థానం
  • ఉత్తరాఖండ్ ద్వితీయ భాష సంస్కృతం

రైల్వే స్టేషన్లలోని సైన్ బోర్డులపై ఉర్దూని తొలగించి, దాని స్థానంలో సంస్కృత భాషలో పేర్లను రాయాలని ఉత్తరాఖండ్ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు సైన్ బోర్డులపై హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో పేర్లు ఉన్నాయి. ఇకపై హిందీ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో ఉండబోతున్నాయి. రైల్వే మాన్యువల్ లోని నిబంధనల ఆధారంగా అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నిబంధనల ప్రకారం స్టేషన్లలో హిందీ, ఇంగ్లీష్ తో పాటు రాష్ట్రంలోని ద్వితీయ భాషతో బోర్డులు ఏర్పాటు చేయాలి. 2010లో ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంస్కృతాన్ని రెండో భాషగా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే, సైన్ బోర్డులు మారబోతున్నాయి.

ఈ సందర్భంగా ఉత్తర రైల్వే చీఫ్ పీఆర్వో దీపక్ కుమార్ మాట్లాడుతూ, ఓ స్థానిక నేత ఈ అంశాన్ని లేవనెత్తడంతో మొరాదాబాద్ రైల్వే డివిజన్ లో ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. నిబంధనల ప్రకారం ఈ మేరకు చర్యలు చేపట్టబోతున్నామని చెప్పారు. బోర్డుపై సంస్కృత భాషను రాయడానికి దశాబ్ద కాలం ఎందుకు పట్టిందన్న ప్రశ్నకు బదులుగా... ఉత్తరాఖండ్ గతంలో ఉత్తరప్రదేశ్ లో భాగంగా ఉండేదని... యూపీలో ద్వితీయ భాష ఉర్దూ కావడంతో సైన్ బోర్డులపై ఆ భాష ఉండేదని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా బోర్డులు అలాగే కొనసాగాయని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఒక వ్యక్తి గుర్తు చేశారని... అందుకే బోర్డులను మారుస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News