Andhra Pradesh: అమరావతి జేఏసీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదు: ఐజీ బ్రిజ్ లాల్

  • ఈ నెల 20న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన జేఏసీ
  • రాజధానిలో 144 సెక్షన్, 30 పోలీస్ చట్టం అమల్లో ఉందన్న ఐజీ
  • ముట్టడికి ఎవరూ రావొద్దంటూ ప్రజలకు సూచన

రాజధాని మార్పును నిరసిస్తూ  ఈ నెల 20న అసెంబ్లీ ముట్టడికి అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని గుంటూరు రేంజ్ ఐజీ బ్రిజ్ లాల్ స్పష్టం చేశారు. రాజధానిలో పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ అమల్లో ఉన్నాయని, అందువల్ల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అనుమతించబోవడం లేదని స్పష్టం చేశారు. ఎల్లుండి మంత్రిమండలి భేటీ, అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉందని వెల్లడించారు. ముట్టడి కార్యక్రమం వల్ల అసెంబ్లీ కార్యక్రమాలకు, ఉద్యోగుల విధులకు ఆటంకం కలుగుతుందని అన్నారు.

అంతేకాదు, అమరావతి జేఏసీ తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి హాజరు కావొద్దంటూ ప్రజలకు సూచించారు. రాజధాని గ్రామాలకు కొత్తవారిని అనుమతించవద్దని, కొత్త వాళ్లు వస్తే చట్టవిరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లో ఇతరులకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లపైనా, వారికి వాహనాలు, వసతులు సమకూర్చినవారిపైనా చట్టబద్ధమైన చర్యలు ఉంటాయని ఐజీ బ్రిజ్ లాల్ హెచ్చరించారు.

Andhra Pradesh
Amaravati
AP Capital
JAC
IG
Police
Brij Lal
  • Loading...

More Telugu News