Andhra Pradesh: రాజధాని మార్చినా అభ్యంతరం లేదనడానికి సిగ్గుండాలి: వైసీపీ ఎమ్మెల్యేలపై ధూళిపాళ్ల మండిపాటు

  • గుంటూరు జిల్లా వైసీపీ నేతలపై ధూళిపాళ్ల ధ్వజం
  • మిమ్మల్ని తరిమికొట్టే రోజు వస్తుందని వ్యాఖ్యలు
  • దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని సవాల్

టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లాలో పుట్టి, ఇక్కడి ప్రజలు ఓట్లేస్తే పదవుల్లోకి వచ్చిన వైసీపీ ప్రజాప్రతినిధులు రాజధాని ఇక్కడి నుంచి తరలించినా అభ్యంతరం లేదంటున్నారని, వారంతా సిగ్గుపడాలని అన్నారు. గేదెకు గడ్డి వేస్తే పాలు వస్తాయని, కానీ వీళ్లకు ప్రజలు ఓట్లేస్తే ద్రోహం చేశారని మండిపడ్డారు. ఇది కన్నతల్లి రొమ్ము గుద్దినట్టు కాదా? అని ప్రశ్నించారు.

ఇలాంటి నేతల గురించి మాట్లాడ్డానికి పదాలు కూడా దొరకడంలేదని, గుంటూరు జిల్లా నేతనైనందుకు సిగ్గుపడుతున్నానని నరేంద్ర పేర్కొన్నారు. "ప్రతి దానికి ఎల్లో మీడియా అంటారు. మీదేంటి పెయిడ్ మీడియా కాదా? పెయిడ్ వార్తలు రాయించుకుని, ఇప్పుడవన్నీ అవాస్తవాలని తేలిన తర్వాత కూడా మీరిలా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. మీరు ప్రజల కోసం ఉన్నారా? జగన్ కోసం ఉన్నారా?

తాడికొండ ఎమ్మెల్యే కూడా రాజధాని తరలించినా అభ్యంతరం లేదనడం బాధాకరం. అధికారం అనే అహంకారంతో కళ్లు మూసుకుపోయిన స్థితిలో పనిచేస్తున్నారు. ఇంకొకాయన అభివృద్ధి చేస్తాం అంటున్నాడు. ఇవాళ గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలకు సవాల్ విసురుతున్నా... మీకు గనుక దమ్ము, ధైర్యం, చీము, నెత్తురు ఉంటే ప్రజలను రిఫరెండం కోరదాం. గుంటూరు జిల్లాకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి. గుంటూరు జిల్లా వరకు ఎన్నికలకు వెళదాం. ప్రజలే తీర్పు ఇస్తారు. ఏ సెంటర్ లో అయితే మీరు నిలబడి మాట్లాడారో అదే సెంటర్ లో మిమ్మల్ని ప్రజలు తరిమికొట్టే రోజు త్వరలోనే వస్తుంది. మహిళల్ని పోలీసులు బూటుకాలితో తన్నుతుంటే ఓ మహిళ అయిన హోంమంత్రి రాక్షసానందం పొందుతున్నారు" అంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News