Pakistan: ముషారఫ్ కు చుక్కెదురు... పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు రిజిస్ట్రార్
- దేశద్రోహం కేసులో ముషారఫ్ కు మరణశిక్ష
- శిక్ష రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ముషారఫ్
- పిటిషన్ స్వీకరించలేమన్న సుప్రీం కార్యాలయం
దేశద్రోహం కేసులో ఇస్లామాబాద్ ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను రద్దు చేయాలంటూ పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, ఆయనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. ఈ కేసులో పిటిషనర్ ఇప్పటివరకు లొంగిపోనందువల్ల ఈ పిటిషన్ ను తిరస్కరిస్తున్నామని తేల్చిచెప్పారు. అయితే, రిజిస్ట్రార్ నిర్ణయంపై త్వరలోనే అప్పీల్ చేయాలని ముషారఫ్ తరఫు న్యాయవాది భావిస్తున్నారు.
2007లో రాజ్యాంగాన్ని రద్దు చేశారంటూ ముషారఫ్ పై అప్పటి పీఎల్ఎం-ఎన్ ప్రభుత్వం న్యాయపోరాటం మొదలుపెట్టింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో ముషారఫ్ తీవ్ర అనారోగ్యం పాలయ్యానంటూ విదేశీ ఆసుపత్రుల్లోనే ఎక్కువగా దర్శనమివ్వడం ప్రారంభించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా తీవ్రమైన కేసుల్లో చిక్కుకుని అనారోగ్యానికి చికిత్స అంటూ లండన్ వెళ్లి అక్కడ ఓ రెస్టారెంట్లో కనిపించడం గమనార్హం.