YSRCP: అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి కోసమే మూడు రాజధానులు: మంత్రి మోపిదేవి వెంకటరమణ
- అన్ని కమిటీలు పరిపాలన వికేంద్రీకరణను సిఫారసు చేశాయి
- ప్రాంతీయ అసమానతలతో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు వస్తాయి
- స్వార్థం కోసమే చంద్రబాబు అమరావతినే కేంద్ర స్థానంగా కోరుకుంటున్నారు
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికోసమే.. తమ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేసిందని ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. గతంలో శ్రీ బాగ్ కమిటీ నుంచి తాజాగా బోస్టన్ కమిటీ వరకు అన్ని కమిటీలు పరిపాలన వికేంద్రీకరణను సిఫారసు చేశాయని మంత్రి అన్నారు. ప్రాంతీయ అసమానతల మూలంగా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు వస్తాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే అభివృద్ధి జరిగిందన్నారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా చంద్రబాబునాయుడు అమరావతినే కేంద్ర స్థానం చేసి తన స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకున్నారని మోపిదేవి విమర్శించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి అక్కడి రైతులను మోసం చేశారని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థను ప్రజల ముందుకు తెచ్చిన ఘనత జగన్ దేనని ఆయన ప్రశంసించారు. అమరావతిలో అసెంబ్లీ అక్కడే ఉంటుందన్నారు. చంద్రబాబు కులాల వైషమ్యాలు, ప్రాంతీయ అసమానతలను రేపుతూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించారు.