KTR: త్వరలోనే నేను సీఎం అవుతాననేది ఊహాగానాలే.. వాస్తవం కాదు!: కేటీఆర్
- మీడియా వాళ్లే మంత్రులతో మాట్లాడిస్తున్నారు
- మునిసిపల్ ఎన్నికల్లో గెలుస్తాం
- బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కేంద్రం నుంచి నిధులు తెచ్చారా?
'త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ సీఎం అవుతారు' అని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ దీనిపై కేటీఆర్ స్పందించారు. 'త్వరలోనే నేను సీఎం అవుతాననేది ఊహాగానాలే.. వాస్తవం కాదు. ముఖ్యమంత్రి పదవి గురించి మీడియా వాళ్లే మంత్రులతో మాట్లాడిస్తున్నారు' అని తెలిపారు.
కాగా, మునిసిపల్ ఎన్నికల్లో తాము గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తూ పైకి డ్రామాలు ఆడుతున్నాయన్నారు. 25 పట్టణాల్లో కాంగ్రెస్, బీజేపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.
రాష్ట్రంలో 90 మినీ ట్యాంక్‌బండ్‌లను నిర్మించామని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ చుట్టూ 25 పార్కులు ఏర్పాటు చేశామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఐదేళ్లలో కేంద్రం నుంచి అదనపు నిధులు తెచ్చారా? అని నిలదీశారు.