mahendrasingh dhoni: బీసీసీఐ కాంట్రాక్టు నిరాకరించిన రోజే.. బ్యాట్ ఝళిపించిన ధనాధన్ ధోనీ!
- ఝార్ఖండ్ రంజీ జట్టుతో కలిపి సాధన
- ఆశ్చర్యపోయిన సహచర ఆటగాళ్లు
- ఐపీఎల్ లో సత్తా చాటేందుకు యత్నం
అవమానంగా భావించాడో...జట్టుకు తన అవసరం ఉందని పరోక్షంగా తెలియజెప్పాలనుకున్నాడో టీమిండియా మాజీ కెప్టెన్, బ్యాట్స్ మన్ కం కీపర్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. అది కూడా బీసీసీఐ కాంట్రాక్టు జాబితా నుంచి పేరును తొలగించిన రోజే అతను మైదానంలోకి అడుగు పెట్టడం విశేషం.
199 వన్డే మ్యాచ్ లకు కెప్టెన్‌గా పనిచేసిన ధోనీ పేరును కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించి అవమానకర రీతిలో బీసీసీఐ వ్యవహరించడంపై ఆయన అభిమానులు ఇప్పటికే రగిలిపోతున్నారు. కనీసం మాటమాత్రంగానైనా చెప్పకుండా తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్నారు.
ప్రపంచకప్ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. సైనిక సేవల కోసం రెండు నెలలు సెలవు పెట్టిన ధోనీ ఆ తర్వాత కూడా మైదానంలోకి అడుగు పెట్టలేదు. తను రిటైర్ కాబోతున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో అతని కెరీర్ ముగిసినట్టే అని భావిస్తున్నారు. కానీ మిస్టర్ కూల్ గా పేరున్న ధోనీ ఈ సందర్భంలోనూ నోరు మెదపలేదు. ఎవరిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
చడీచప్పుడు కాకుండా ప్యాడ్స్ కట్టుకుని, చేతులకు గ్లవుజులు తొడుక్కుని బ్యాట్ తో మైదానం లోకి అడుగు పెట్టాడు. ఝార్ఖండ్ రంజీ జట్టుతో కలిసి సాధన మొదలు పెట్టాడు. త్వరలో జరగనున్న ఐపీఎల్ లో తన సత్తా ఏమిటో నిరూపించి బీసీసీఐకి పరోక్షంగా తన అవసరాన్ని తెలియజేసే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆటగాళ్లంతా ఎరుపు బంతితో సాధన చేస్తే ధోనీ మాత్రం తెలుపు బంతితో సాధన చేశాడు. అతను ఓ బౌలింగ్ యంత్రాన్ని కూడా సమకూర్చుకున్నాడని సమాచారం.
'ధోనీ రాకను ఊహించలేకపోయాం. మాతో సాధన చేసేందుకు హఠాత్తుగా ప్రత్యక్షం కావడంతో సంతోషంగా అనిపించింది. అతను చాలా సేపు బ్యాటింగ్ చేశాడు. మాతో కలిసి ఫీల్డింగ్ చేశాడు. ఇకపై క్రమం తప్పకుండా మాతో సాధన చేస్తాడని భావిస్తున్నాం. అతను మాతో కలిసి మైదానంలో ఉన్నాడన్న భావనే మాకు గొప్ప శక్తినిస్తుంది' అంటూ రంజీ జట్టు ఆటగాళ్లు పొంగిపోయారు. దటీజ్ ధోనీ. దీన్ని బీసీసీఐ గుర్తిస్తుందో? లేదో? చూడాలి.