Biryani: బిర్యానీలో ఇనుప ముక్క.. కంగుతిన్న కస్టమర్!
- రెస్టారెంట్ పై ఫిర్యాదు చేసిన బాధితుడు
- తనిఖీలు నిర్వహించిన అధికారులు
- లోపాలున్నట్లు గుర్తించి రూ.5వేలు జరిమానా
జిహ్వ చాపల్యం మనిషి బలహీనత. రుచికరంగా ఉంటుందని చెప్పగానే ఆర్డర్ ఇచ్చేస్తాం. కానీ పదార్థాల నాణ్యత, తయారీలో జాగ్రత్తలు అస్సలు పట్టించుకోం. ఎప్పుడైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే మాత్రం కంగుతింటాం. ఇందుకు ఈ సంఘటనే ఉదాహరణ.
హైదరాబాద్ శివారు కూకట్ పల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు జొమాటో ద్వారా బిర్యానీ, కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చాడు. జొమాటో సిబ్బంది వేడివేడి పదార్థాలు కాసేపటికి తెచ్చివ్వగా తినేందుకు సిద్ధమయ్యాడు. బిర్యానీ తింటుండగా పంటికింద ఏదో గట్టిగా తగిలింది. ఆశ్చర్యపోతూ తీసి చూస్తే అది ఇనుప ముక్క!
దాన్ని చూడగానే శ్రీనివాస్ గతుక్కుమన్నాడు. పొరపాటున అది లోపలికి వెళ్లి ఉంటే ఏంటి పరిస్థితి? అని ఆందోళన చెందాడు. వెంటనే జొమాటో సిబ్బందికి ఫిర్యాదు చేస్తే వారు క్షమాపణతో సరి పెట్టి ఓ డిస్కౌంట్ కూపన్ ఎరగా వేశారు. దీనికి సంతృప్తి చెందని సదరు యువకుడు జీహెచ్ఎంసీ యాప్ ద్వారా రెస్టారెంట్ పై ఫిర్యాదు చేశాడు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు సదరు హోటల్ పై దాడులుచేసి తనిఖీలు నిర్వహించారు. లోపాలను గమనించి రూ.5 వేలు జరిమానా విధించారు. దీనికీ సంతృప్తి చెందని శ్రీనివాస్ జరిగిన దానిపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.