Hyderabad: ఉదయం పేపర్ బాయ్.. రాత్రి దొంగబ్బాయ్!

  • అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
  • 40 తులాలకు పైగా బంగారం స్వాధీనం
  • పీడీ యాక్ట్ నమోదు

అతని పేరు వెంకటేశ్. వయసు 25 సంవత్సరాలు. చేసేది పేపర్ బాయ్ పని. అయితేనేం? ఉదయం పేపర్ వేస్తూ, తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రి పూట చోరీ చేస్తాడు. ఇతనిపై ఇప్పటివరకూ 51 కేసులు నమోదయ్యాయి. ఎట్టకేలకు ఇతన్ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు వివరాలను తెలిపారు.

నెల్లూరు జిల్లాకు చెందిన వల్లపు వెంకటేశ్, కూకట్ పల్లి పరిధిలోని హైదర్ గూడలో ఉంటూ, వ్యసనాలకు బానిసయ్యాడు. ఉదయం పేపర్ వేస్తూ, తాళం వేసిన ఇంటిని గుర్తించి, రాత్రి పూట వచ్చి, తనకు అందినంత దోచుకెళ్తాడు. పలు హాస్టళ్లలో సెల్ ఫోన్లను, ల్యాప్ టాప్ లను కూడా దొంగిలించాడు. వెంకటేశ్ పై జగద్గిరిగుట్ట, చందానగర్, ఎల్బీ నగర్, పేట్ బషీర్ బాద్, బోయిన్ పల్లి, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో 51 కేసులు నమోదయ్యాయి.

వెంకటేశ్ కదలికలపై గత కొంతకాలంగా నిఘా పెట్టిన మియాపూర్ పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసి, పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అతని నుంచి 40 తులాలకు పైగా బంగారు నగలు, బైక్ తో పాటు రూ. 1.17 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని, మత్తు పదార్థాలు, గంజాయి తదితరాలకు అలవాటు పడిన నిందితుడు చోరీ డబ్బుతో జల్సాలు చేశాడని పోలీసులు తెలిపారు.

Hyderabad
Police
Arrest
Paper boy
  • Loading...

More Telugu News