Pawan Kalyan: బీజేపీతో పొత్తుకు ముందు జరిగింది ఇదీ: పవన్ కల్యాణ్
- రెండున్నర నెలలపాటు చర్చించాం
- జనసేన మిగతా ప్రాంతీయ పార్టీల్లాంటిది కాదు
- మోదీ అనుసరిస్తున్న మార్గాలు కట్టిపడేశాయి
బీజేపీతో పొత్తుకు ముందు వివిధ దశల్లో రెండున్నర నెలలపాటు చర్చించినట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఆషామాషీగా ఏమీ పొత్తుపెట్టుకోలేదని, అన్నీ చర్చించి ఓ అంగీకారానికి వచ్చిన తర్వాతే పొత్తు కుదుర్చుకున్నట్టు చెప్పారు. తాము మిగతా ప్రాంతీయ పార్టీల్లా కాదని, తాము జాతీయ సమైక్యత కోరుకుంటామని పవన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేపీకి, తమకు భావ సారూప్యత ఉందన్నారు.
ప్రధాని మోదీ నాయకత్వంపై తనకు నమ్మకం ఉందన్న పవన్.. దేశాభివృద్ధి కోసం మోదీ అనుసరించే విధానాలు, మార్గాలు తనను కట్టిపడేశాయన్నారు. గత ఎన్నికల్లోనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నించినా కుదరలేదని, ఈసారి సాధ్యమైందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చి చూపెడతామని పవన్ ధీమా వ్యక్తం చేశారు.