Pawan Kalyan: వైసీపీ, టీడీపీలతో బీజేపీకి సంబంధం లేదు.. పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: జీవీఎల్
- రాష్ట్ర రాజకీయాల్లో ఈరోజు చారిత్రాత్మక దినం
- జనసేనతో కలిసి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం
- ఏపీలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తాం
ఏపీ రాజకీయాల్లో ఈరోజు ఒక చారిత్రాత్మక దినమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీజేపీ, జనసేనలు కలసి పని చేయాలని నిర్ణయించాయని... ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేస్తుందని చెప్పారు.
గత ఏడు నెలల్లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల పరిస్థితిని చూస్తున్నామని... మోదీ, అమిత్ షాలు తమ వెంటే ఉన్నారని వైసీపీ చెప్పుకుంటోందని... బీజేపీని దూషించిన టీడీపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తమకు దగ్గరగా ఉందని చెప్పుకుంటోందని అన్నారు. వైసీపీ, టీడీపీలతో బీజేపీకి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కేవలం జనసేనతో మాత్రమే బీజేపీ కలసి పనిచేస్తుందని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేనతో కలసి ఈరోజు కొత్త కూటమిని ఏర్పాటు చేశామని... తమ కూటమి రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని జీవీఎల్ తెలిపారు. బీజేపీతో కలిసి పని చేయాలని జనసేనాని పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని అన్నారు. అనేక రాష్ట్రాల్లో ఒకటి, రెండు శాతం మాత్రమే ఓటర్లను కలిగి ఉన్న స్థాయి నుంచి అధికారాన్ని చేపట్టే స్థాయికి బీజేపీ చేరిందని ఆయన గుర్తు చేశారు. కేవలం నాలుగేళ్ల సమయంలోనే బీజేపీ ఇదంతా సాధించిందని చెప్పారు. ఇదే విధంగా ఏపీలో కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కుల రాజకీయాలు, కక్ష సాధింపు రాజకీయాలను తిరస్కరిస్తూ... అభివృద్ధినే ఆధారంగా చేసుకుని తమ కూటమిని ప్రజలు ఆశీర్వదిస్తారని తాము నమ్ముతున్నామని జీవీఎల్ చెప్పారు. ఒక మంచి వాతావరణంలో ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. ఇక నుంచి ఇరు పార్టీల శ్రేణులు ఉత్సాహంతో ముందుకు సాగుతూ ప్రజా క్షేత్రంలో నిలుస్తాయని చెప్పారు.