Malladi Vishnu: అందరూ కలిసి వైసీపీ ప్రభుత్వంపై కుట్ర పన్నారు: మల్లాది విష్ణు
- చంద్రబాబు సూచనతోనే పవన్ ఢిల్లీకి వెళ్లారు
- 2019లో జనసేనను ప్రజలు తిరస్కరించారు
- బీజేపీ, జనసేన పొత్తుతో వైసీపీకి నష్టం లేదు
ఏపీలో సరికొత్త రాజకీయాలకు తెరలేచింది. బీజేపీ, జనసేన పార్టీలు చేతులు కలపడంతో... ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలు మలుపుతిరిగాయి. మరోవైపు ఈ వ్యవహారంపై వైసీపీ నేత మల్లాది విష్ణు విమర్శలు గుప్పించారు. జనసేన జెండా పీకేస్తోందని... బీజేపీలో విలీనం కావడానికి సిద్ధమైందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సూచన మేరకే డిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో పవన్ కలిశారని చెప్పారు.
2014లోనే బీజేపీ, జనసేన పొత్తు ఉందని మల్లాది విష్ణు అన్నారు. 2019 ఎన్నికల్లో జనసేనను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని చెప్పారు. అన్ని పార్టీలు కలిసి వైసీపీ ప్రభుత్వంపై కుట్ర పన్నాయని మండిపడ్డారు. ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ గతంలో బీజేపీని పవన్ కల్యాణ్ విమర్శించారని... ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపారని విమర్శించారు. బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నంత మాత్రాన వైసీపీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు.