taanaji: ఫడ్నవీస్ లేఖ.. ‘తానాజీ’కి పన్ను మినహాయింపునకు ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఛత్రపతి శివాజీ సైన్యంలో కీలకంగా వ్యవహరించిన తానాజీ
- పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరిన మాజీ సీఎం ఫడ్నవీస్
- ఓకే చెప్పిన మహా కేబినెట్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో కీలకంగా వ్యవహరించిన తానాజీ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘తానాజీ’. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్, కాజోల్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు హరియాణా ప్రభుత్వం ఇప్పటికే పన్ను మినహాయింపునిచ్చింది.
మరోపక్క, తానాజీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. ఈ క్రమంలో నిన్న జరిగిన 'మహా' కేబినెట్ సమావేశంలో ‘తానాజీ’కి పన్ను మినహాయింపుపై మంత్రులు తీవ్రంగా చర్చించారు.
అనంతరం ఈ సినిమాకు పన్ను రద్దు చేయాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం మంత్రి బాలా సాహెబ్ తోరత్ మాట్లాడుతూ.. ‘తానాజీ’కి పన్ను మినహాయింపు ఇవ్వాలని మంత్రి వర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేస్తారని తెలిపారు.