Avalanche: హిమపాతం తరుముకొస్తుంటే వీడియోలు తీయబోయారు.. చివరకు పరుగో పరుగు.. వీడియో వైరల్
- హిమాచల్ ప్రదేశ్‌లో ఘటన
- వీడియో పోస్ట్ చేసిన ఓ ఐఆర్ఎస్ అధికారి
- నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు
హిమపాతం తరుముకొస్తుంటే కొందరు పర్యాటకులు దాన్ని వీడియో చేశారు. హిమపాతం ఆగకుండా తమకు దగ్గరగా రావడంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని టింకు నల్లాహ్ ప్రాంతంలో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఆర్ఎస్ అధికారి నవీద్ ట్రుంబూ పోస్ట్ చేయడంతో అందరి దృష్టికి వచ్చింది.
హిమపాతం తమ వద్దకు రాగానే 'వెనక్కి వెళ్లండి' అంటూ అరుస్తూ పరుగులు తీశారు. సురక్షిత ప్రదేశానికి చేరుకున్నాక కూడా కొందరు పర్యాటకులు మళ్లీ వీడియో తీయడం ప్రారంభించారు. 'కళ్ల ముందు హిమపాతం ముంచుకురావడం ఎప్పుడైనా చూశారా?' అని ప్రశ్నిస్తూ నవీద్ ట్రుంబూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.