Nirmal District: ఘర్షణలతో అట్టుడికిన భైంసా కుదుటపడుతోంది!
- మూడు రోజుల క్రితం మొదలైన ఘర్షణలు
- ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి
- బైకులు, ఆటోలు, కార్లు, ఇళ్లు దగ్ధం
ఇరు వర్గాల ఘర్షణలతో మూడు రోజుల క్రితం అట్టుడికిన నిర్మల్ జిల్లాలోని భైంసా ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పట్టణంలో కర్ఫ్యూ విధించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిన్న ఉదయం పట్టణంలో కవాతు నిర్వహించిన పోలీసులు ప్రధాన కూడళ్లు, ప్రార్థనా మందిరాలు, ఆలయాల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
భైంసాలో అసలేం జరిగిందంటే.. మూడు రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పట్టణంలోని కోర్వగల్లిలో తమ వర్గం వారిపై దాడి చేస్తున్నారన్న పుకార్లతో మరో వర్గం ప్రజలు దాడికి దిగారు. ఇరు వర్గాల ప్రజలు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. ఈ గొడవల్లో వీధుల్లో పార్క్ చేసిన 23 బైకులు, 2 ఆటోలు, ఓ కారుకు నిప్పు పెట్టారు. 16 ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి.
మంటల్లో కొందరు గ్యాస్ సిలిండర్లు వేయడంతో అవి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నాయి.