Nirbhaya: జైల్లో పనిచేసి.. వేలాది రూపాయలు సంపాదించిన నిర్భయ దోషులు!
- అత్యధికంగా రూ. 69 వేలు సంపాదించిన ముఖేశ్ సింగ్
- ఒక్క రూపాయి కూడా సంపాదించని అక్షయ్ ఠాకూర్
- దోషులకు భోజనం తగ్గించిన అధికారులు
2012లో దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్భయపై దారుణ హత్యాచారం చేసి, అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉంటూ, ఈ నెల 22న ఉరిశిక్షను ఎదుర్కోనున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు జైల్లో పని చేసి, వేల రూపాయలను సంపాదించగా, వాటిని కుటుంబీకులకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.
దోషి ముఖేశ్ సింగ్ అందరికన్నా ఎక్కువగా రూ. 69 వేలు సంపాదించగా, వినయ్ శర్మ రూ. 39 వేలు, పవన్ గుప్తా రూ. 29 వేలు సంపాదించారని వెల్లడించిన అధికారులు, అక్షయ్ ఠాకూర్ మాత్రం కూలీ పనులు చేసేందుకు నిరాకరించినందున ఎలాంటి వేతనమూ దక్కలేదని తెలిపారు.
ఇదిలావుండగా, దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నలుగురికీ పెడుతున్న భోజనాన్ని తగ్గించారు. జైలులో వినయ్ శర్మ పలుమార్లు అనుచితంగా ప్రవర్తించినందున అతన్ని 11 సార్లు శిక్షించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. పవన్ గుప్తా 8 సార్లు, అక్షయ్ కుమార్ 3 సార్లు, ముఖేశ్ సింగ్ ఒకసారి శిక్షకు గురయ్యారని చెప్పారు.
ప్రస్తుతం వీరందరినీ కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రత్యేక జైలు గదుల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచామని, వీరికి ఈ 22న ఉదయం 7 గంటలకు మరణశిక్షను అమలు చేస్తామని అన్నారు. కాగా, వీరిపై డెత్ వారెంట్ ఇప్పటికే జారీ కాగా, క్యూరేటివ్ పిటిషన్ ను సైతం సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే.