Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీపై ఈసీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ
- ఎన్నికల్లో కాంగ్రెస్ పంచే డబ్బులు తీసుకోవాలని పిలుపు
- ఓటు మాత్రం తమకే వెయ్యాలన్న మజ్లిస్ అధినేత
- చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి షబ్బీర్ అలీ ఫిర్యాదు
మునిసిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పంచే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం తమకే వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఒవైసీ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఓట్లు కొనేది మజ్లిస్, టీఆర్ఎస్‌లేనన్న విషయం అందరికీ తెలిసిందేనని షబ్బీర్ అలీ విమర్శించారు.
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒవైసీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని, వారు పంచే డబ్బులు తీసుకుని, ఓటు మాత్రం తమకే వేయాలని పిలుపునిచ్చారు. అయితే, తన విలువ మాత్రం రూ. రెండు వేలు కాదని, అది ఇంకా ఎక్కువని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన షబ్బీర్ అలీ ఈసీకి ఫిర్యాదు చేశారు.