Tennis: రెండున్నరేళ్ల తర్వాత తిరిగి టెన్నిస్ లోకి సానియా.. హోబర్ట్ టోర్నీలో శుభారంభం
- ఈ రోజు నాకు ప్రత్యేకమైన రోజు
- అందరికీ ధన్యవాదాలంటూ ట్వీట్
- మహిళల డబుల్స్ లో రెండో రౌండ్లోకి సానియా జోడీ
ఇటీవల కుమారుడికి జన్మనిచ్చిన స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి హైదరాబాద్ కు చెందిన సానియా మీర్జా దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత తిరిగి టెన్నిస్ లోకి అడుగిడింది. తాజాగా ఆమె అస్ట్రేలియాలో జరుగుతోన్న హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ మహిళల డబుల్స్ లో శుభారంభం చేసింది. రెండో రౌండ్లోకి సానియా జోడీ ప్రవేశించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి నాదియ కిచినోక్ తో కలిసి ఆడుతున్న సానియా 2-6, 7-6(3), 10-3 తేడాతో ఒకసన కలష్నికోవా(జార్జియా), మియుకాటో(జపాన్)జోడీని కంగుతినిపించింది.
దాదాపుగా గంటన్నరకు పైగా సాగిన ఈ పోటీ హోరాహోరీగా సాగింది. తొలి సెట్లో ప్రత్యర్థి జోడీకి తేలిగ్గా లొంగిపోయిన సానియా జోడీ రెండో సెట్లో గట్టి పోటీ నిస్తూ.. విజయం సాధించింది. మ్యాచ్ నిర్ణయాత్మకమైన మూడో సెట్ నువ్వా? నేనా? అన్నట్లు ఆట సాగింది. చివరికి సానియా-నాదియా జోడీ ఆట ముందు కలష్నికోవా-మియుకాటో జోడీ నిలువలేకపోయింది.
ఈ గెలుపుపై సానియా ట్వీట్ చేస్తూ..‘ ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. నా తల్లిదండ్రులు, నా కుమారుడు నాకు మద్దతుగా నిలిచారు. దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత టెన్నిస్ ఆడుతూ తొలి రౌండ్ లో నెగ్గాను. నేను విజయం సాధించాలని సందేశాలు పంపిన వారందరికి ధన్యవాదాలు’ అని పేర్కొంది.