Pakistan: పంజాబ్ లోకి డ్రోన్ లను పంపిన పాక్.. తీవ్ర కలకలం...హై అలర్ట్
- సరిహద్దు గ్రామం టెండీవాలలో ఎగిరిన డ్రోన్
- సుమారు ఐదు నిమిషాల పాటు గాల్లో చక్కర్లు
- కూల్చివేతకు సన్నద్ధమయ్యేలోపే..తిరిగి పాక్ లోకి
భారత్, పాక్ సరిహద్దుల్లోని పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్ పూర్ లో పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ కదలికలు భారత భద్రతా బలగాల్లో కంటిమీద కునుకు లేకుండా చేశాయి. నిన్న రాత్రి 8.40 గంటలకు ఈ డ్రోన్ ఉనికిని బీఎస్ఎఫ్ బలగాలు గుర్తించాయి. సరిహద్దు గ్రామమైన టెండీవాల గ్రామం వద్ద డ్రోన్ ఉనికిని జవాన్లు పసికట్టారు.
సుమారు నాలుగు నుంచి ఐదు నిమిషాలపాటు గ్రామంలో ఈ డ్రోన్ ఎగిరినట్లు నిర్ధారించారు. దాన్ని కూల్చేందుకు బీఎస్ఎఫ్ జవాన్లు సిద్ధమయ్యేలోపే డ్రోన్ మళ్లీ పాక్ భూభాగంలోకి వెళ్లిపోయిందని సమాచారం. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ డ్రోన్ ఎక్కడనుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే అంశాలపై బీఎస్ఎఫ్ బలగాలు దర్యాప్తు ప్రారంభించాయి.