Cock Fight: పందెం రాయుళ్ల కొత్త మార్గం... సంక్రాంతి క్రీడా పోటీల పేరిట బరులు!
- సిద్ధమైన కోడి పందాల బరులు
- సాంస్కృతిక కార్యక్రమాల పేరిట బరులు
- కత్తి కడితే కేసులు తప్పవంటున్న పోలీసులు
పందెం రాయుళ్లు సిద్ధమైపోయారు. ఈసారి కాస్తంత తెలివిగా, కోడిపందాల బరులకు బదులు, 'సంక్రాంతి క్రీడా పోటీలు' అంటూ ప్లెక్సీలు ముద్రించి, అనధికారికంగా పందెం బరులను సిద్ధం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని గన్నవరం, తోట్లవల్లూరు, ఆత్కూరు, కంకిపాడు, నున్న తదితర ప్రాంతాల్లో పలు చోట్ల స్థలాలను శుభ్రం చేసి, భారీ టెంట్లు వేసి, చుట్టూ కంచెలు ఏర్పాటు చేశారు.
ఇక పోలీసులు, అధికారులు వీటి గురించి ఆరా తీస్తే, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం స్థలాన్ని చదును చేస్తున్నామని చెప్పడంతో, వారూ ఏమీ అనలేని పరిస్థితి. ఇక, కోడి పందాలు, జూదాలను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఉన్న అధికారులు, హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేసినా, వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. కత్తి కట్టి కోడి పందేలు నిర్వహిస్తే, ఐపీసీ సెక్షన్-11 కింద కేసులు నమోదు చేస్తామని, బరులు ఏర్పాటు చేయాలనుకుంటే ముందస్తు అనుమతి తప్పనిసరని, ఇక్కడ కూడా సంప్రదాయ ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు మాత్రమే నిర్వహించుకోవచ్చని అంటున్నారు.