Supreme Court: శబరిమల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
- రివ్యూ పిటిషన్లను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టీకరణ
- వేర్వేరు మతాల్లో మహిళలపై ఉన్న వివక్షపై వాదనలకు ఓకే
- వాదనల అంశాలను తేల్చేందుకు సీనియర్ న్యాయవాదుల సమావేశం
శబరిమల వివాదం విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవడం లేదని అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే, వేర్వేరు మతాల్లో మహిళలపై కొనసాగుతున్న వివక్ష వంటి విస్తృత అంశంపై వాదనలు వినేందుకు అంగీకరించిన సుప్రీం.. ఏయే అంశాలపై వాదనలు వినవచ్చో తేల్చేందుకు నలుగురు సీనియర్ న్యాయవాదులు 17న సమావేశం కావాలని సూచించింది.
గతంలో ఐదుగురు న్యాయమూర్తులు నివేదించిన అంశాలను మాత్రమే పరిశీలిస్తామని, రివ్యూ పిటిషన్లు మాత్రం కాదని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ముస్లిం మహిళలకు మసీదుల్లో ప్రవేశం, బోహ్రా ముస్లిం తెగలో బాలికలకు సున్తీ ఆచారం, ఇతర మతస్తులను పెళ్లాడే పార్శీ మహిళలపై ఉన్న ఆంక్షలకు సంబంధించిన పిటిషన్లను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్టు న్యాయస్థానం తెలిపింది.