KTR: ఎన్నికల ప్రచారానికి సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలి: కార్యకర్తలకు కేటీఆర్ పిలుపు
- ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయం సోషల్ మీడియా
- మున్సిపల్ ఎన్నికల ప్రచారం వినూత్నంగా చేయండి
- పతంగులపై కేసీఆర్ చిత్రాలు ఉండేలా చూడాలి
తెలంగాణలో ఈ నెల 22న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ ఓ పిలుపు నిచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తమ కార్యకర్తలతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ ఫేస్ బుక్ ఖాతాలో 11 లక్షలు, ట్విట్టర్ ఖాతాలో 3.6 లక్షల ఫాలోవర్స్ ఉన్నారని అన్నారు. చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా సోషల్ మీడియా ద్వారా చెప్పొచ్చని అన్నారు.
ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో 16 లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని, వీళ్లందరినీ సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యపరచాలని పిలుపు నిచ్చారు. వినూత్న ఎన్నికల ప్రచారంతో ప్రజలకు దగ్గరవ్వాలని, మహిళలు తమ నివాసాల ముందు ‘కారు’ గుర్తు ముగ్గులు వేస్తున్నట్టుగా, పతంగులపై కేసీఆర్ చిత్రాలు ఉండేలా చూడాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన విరుచుకుపడ్డారు. బీజేపీకి అభ్యర్థులను నిలబెట్టే పరిస్థితి కూడా లేదని అన్నారు.