India: అవసరముంటే.. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కు దిగుతా: కోహ్లీ
- అత్యుత్తమ జట్టును కలిగివుండాలని ప్రతి కెప్టెన్ కోరుకుంటాడు
- రోహిత్, ధావన్, రాహుల్ ముగ్గురూ ఆడవచ్చు
- ఫామ్ లో ఉన్న ఏ ఆటగాడైనా జట్టుకు ఉపయోగకరం
ఆస్ట్రేలియా జట్టుతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనున్న నేపథ్యంలో రేపు తొలి మ్యాచ్ మంబయిలో ప్రారంభం కానుంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో టాప్ ఆర్డర్ బ్యాటింగ్ లో మార్పులు ఖాయమన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పందించాడు. జట్టు అవసరాలను బట్టి తన బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. రోహిత్, ధావన్, రాహుల్ ను సర్దుబాటు చేయాల్సి వస్తే.. తాను బ్యాటింగ్ ఆర్డర్లో కిందికి దిగుతానన్నాడు.
‘ఫామ్ లో ఉన్న ఏ ఆటగాడైనా జట్టుకు ఎంతో ఉపయోగకరం. అత్యుత్తమ జట్టును కలిగివుండాలని ప్రతి కెప్టెన్ కోరుకుంటారు. అందులోనే సరైన కూర్పును ఎంచుకుంటారు. టాప్ ఆర్డర్ లో ఆ ముగ్గురూ ఆడే అవకాశముండొచ్చు. జట్టు కెప్టెన్ గా ఉన్న నేను అవసరమైనప్పుడు ఒక స్థానాన్ని భర్తీ చేసే స్థితిలో ఉండాలి. అది నా బాధ్యత. కెప్టెన్ గా జట్టును చూసుకోవడమే పని కాదు. మనం లేనప్పుడూ కూడా జట్టును సరైన దిశలో కొనసాగేలా చూడాలి’ అని కోహ్లీ అన్నాడు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే ను రేపు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగనుండగా, రెండో వన్డే 17న రాజ్ కోట్ లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో, మూడో వన్డే 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది.