Nirbhaya: నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు విధానాన్ని వివరించిన అధికారులు

  • వారి ప్రవర్తనలో తేడా కనిపించలేదన్న అధికారులు
  • కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఇస్తున్నామని వెల్లడి
  • ఉరితీత ట్రయల్స్ నిర్వహించిన తీహార్ జైలు అధికారులు

దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో దోషులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై జైలు అధికారులు మాట్లాడుతూ, నలుగురు దోషులకు ఉరితీత అమలు తీరును వివరించామని చెప్పారు. అయితే, ఆ నలుగురు దోషులు ఈ విషయాన్ని చాలా మామూలుగా స్వీకరించారని, వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. బహుశా వారు ఉరిశిక్ష అమలు నిలిచిపోతుందన్న భావనలో ఉండి ఉంటారని అధికారులు పేర్కొన్నారు.

ఉరిశిక్ష అమలుకు ముందు దోషులను వారి కుటుంబ సభ్యులతో ఒక్కసారి కలిసేందుకు అనుమతిస్తామని వెల్లడించారు. సాధారణంగా ఖైదీలు వారంలో రెండు సార్లు కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చు. ఉరిశిక్ష ఖరారైన నేపథ్యంలో దోషులకు ఆ అవకాశం ఉండదు. ఇప్పటివరకు తీహార్ జైల్లోని ఉరికంబం ఒకేసారి ఇద్దర్ని ఉరితీసేందుకు మాత్రమే అనువైనదిగా ఉండేది. కానీ, ఈసారి నలుగుర్ని ఉరితీయాల్సి ఉండడంతో అందుకు అనుగుణంగా మార్పులు చేశారు. తాజాగా, ఉరితీత కోసం ట్రయల్స్ నిర్వహించారు. ట్రయల్స్ లో భాగంగా దోషుల బరువుకు సమానమైన ఇసుక మూటలను ఉరికంబానికి వేళ్లాడదీశారు.

  • Loading...

More Telugu News