pok: పీవోకేను స్వాధీనం చేసుకోవడానికి ఆదేశాలు ఇవ్వండి: బీజేపీకి శివసేన సూచన

  • ప్రతిపక్షాలపై విమర్శలు చేసే బదులు భారత ఆర్మీ చీఫ్‌కు ఆదేశాలివ్వాలి
  • భారత సైన్యాధిపతి  చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదు
  • ఎన్ని మెరుపు దాడులు జరిగినా పాక్ తన బుద్ధిని మార్చుకోలేదు

తుక్డే-తుక్డే గ్యాంగ్‌ అంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేసే బదులు భారత ఆర్మీ చీఫ్‌కు పీవోకేను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయవచ్చు కదా? అంటూ  బీజేపీపై శివసేన విమర్శలు గుప్పించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌ అధీనంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశిస్తే తాము చర్యలు చేపడతామని ఇటీవల భారత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే చేసిన వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేం లేదని తెలిపింది.

పీఓకేలో చాలా వరకు ఉగ్రవాద శిబిరాలున్నాయని తెలిపింది. పాక్ సైన్యం, ఐఎస్‌ఐ మద్దతుతో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, అందుకే తాము నరవణే విధానాన్ని స్వాగతిస్తున్నామని తమ అధికారిక పత్రిక సామ్నాలో శివసేన ఓ కథనం ప్రచురించింది. 1994 ఫిబ్రవరిలో జమ్మూ కశ్మీర్‌, పీఓకే భారత్‌లో అంతర్భాగమేనని పార్లమెంటు తీర్మానం చేసిందని నరవణే చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ఎన్ని మెరుపు దాడులు జరిగినా పాక్ తన బుద్ధిని మార్చుకోలేదని గుర్తు చేసింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం పీఓకేపై కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది.

  • Loading...

More Telugu News