kangana ranut: హిందీ భాష రాకుంటే మీకు అవమానంగా అనిపించదా?: బాలీవుడ్ భామ కంగనా రనౌత్
- అమ్మ భాషను మించింది మరొకటి లేదు
- మీ పిల్లలకు హిందీ నేర్పించండి
- దేశీయ నూనెతో చేసిన పరోటాకే రుచి ఎక్కువ
హిందీ భాష రాకుంటే మీకు అవమానంగా అనిపించదా? అని బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ప్రశ్నించింది. ఈ రోజు తానీ స్థితిలో ఉన్నానంటే అందుకు హిందీ భాషే కారణమని, ఆ భాషంటే తనకు మక్కువని చెప్పుకొచ్చింది. ఆంగ్ల భాషపై తన ఉచ్చారణను కొందరు ఎగతాళి చేస్తున్నా తాను పట్టించుకోకపోవడానికి కారణం హిందీపై ఉన్న అభిమానమేనని తెలిపింది.
బాలీవుడ్ లో ప్రముఖ కథానాయకగా రాణిస్తున్న ఈ భామ ఇటీవల హిందీ భాషా దినోత్సవం సందర్భంగా రూపొందించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఇంగ్లీషు మాట్లాడడాన్ని గర్వంగా భావిస్తున్న మనం, హిందీ మాట్లాడేందుకు నామోషీగా ఫీలవుతున్నామని ఈ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసిందీ భామ. ఆంగ్ల భాషపై తమకు పట్టులేదని కొందరు అవమానంగా భావిస్తున్నారు తప్ప, అదే హిందీ భాషలో పట్టులేదని బాధపడడం లేదని బాధను వ్యక్తం చేసింది.
'తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే. మీ పిల్లలకు హిందీ భాష నేర్పించండి. 'మా' అన్న పిలుపులో ఉన్న మాధుర్యం మామ్ లో ఉండదు. ఎంతైనా దేశీయ నూనెతో చేసిన పరోటా రుచికి పిజ్జాలు, బర్గర్లు సరిపోతాయా చెప్పండి?' అంటూ స్థానికతతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిందీ భామ.