JNU Rides: అవును...ఆమె ఏబీవీపీ కార్యకర్త!: పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
- జేఎన్‌యూ ఘటన నిందితుల 'ముసుగు' తొలగిస్తున్న పోలీసులు
- సీసీ పుటేజీ ఆధారంగా బాధ్యుల గుర్తింపు
- ఈనెల 5న గుర్తు తెలియని వ్యక్తుల దాడులు
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక విశ్వవిద్యాలయంలో జేఎన్‌యూలో ఈ నెల 5వ తేదీ రాత్రి దాడులకు పాల్పడిన విద్రోహశక్తుల 'ముసుగు'ను పోలీసులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడిలో వర్సిటీ విద్యార్థి సంఘం నాయకురాలు ఐషే ఘోష్ తదితరులు 22 మంది గాయపడిన విషయం తెలిసిందే. దాడి సందర్భంగా వర్సిటీ వసతి గృహాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన పుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే ఓ చిత్రంలో చారల చొక్కా, ముఖానికి లైట్ బ్లూ స్కార్ఫ్, చేతిలో కర్రపట్టుకున్న యువతిని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన విద్యార్థినిగా పోలీసులు ధ్రువీకకరించారు. ఈమెను బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్త అని భావిస్తున్నారు. ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
మరోవైపు దాడిలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తుల్లో అక్షత్ అవాస్థీ అనే మరో ఏబీవీపీ విద్యార్థి కూడా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అందువల్ల విచారణకు హాజరు కావల్సిందిగా అతనికి కూడా నోటీసులు పంపారు.
మొత్తం దాడుల్లో తొమ్మిది మంది పాల్గొన్నట్లు ఇప్పటికే పోలీసులు జాబితా విడుదల చేయగా, అందులో తీవ్రంగా గాయపడిన ఐషే ఘోష్ పేరు కూడా ఉండడం ఆశ్చర్యపరిచింది. మొత్తం 37 మందిని పోలీసులు అనుమానితుల జాబితాలో చేర్చారు. అందుకే జాబితా విడుదల కాగానే ఇది పోలీసుల కుట్రని, అందువల్ల ఢిల్లీ పోలీసులతో విచారణ జరిపించాలని ఐషే ఘోష్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.