Tamilnadu: తమిళనాడు యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య... ప్రొఫెసర్ వేధింపులే కారణమని నిరసనలు!
- తమిళనాడులోని సేలంలో ఘటన
- ఎమ్మెస్సీ చదువుతున్న నివేద
- విద్యార్థి సంఘాల ఆందోళన
తమిళనాడులోని సేలం దగ్గరలోని పెరియార్ వర్శిటీలో ఎమ్మెస్సీ బోటనీ చదువుతున్న ఓ విద్యార్థిని తన హాస్టల్ రూములో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నివేదిత అనే విద్యార్థిని ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చేస్తూ, ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకోగా, విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించి, ఆమె రాసిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు.
అయితే, కళాశాలలో వేధింపులతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తోటి విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బోటనీ డిపార్ట్ మెంటుకు చెందిన ఓ ప్రొఫెసర్, మరో విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించాడని, దీనిపై ఆమె యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు కూడా చేసిందని, తర్వాత ఆమె ఫిర్యాదును ఉపసంహరించుకుందని విద్యార్థి సంఘాలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో నివేదిత కూడా ఆ అమ్మాయి విభాగమే కాబట్టి, పూర్తి పారదర్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా, సహ విద్యార్థినులు అడ్డుకున్నారు. పోలీసులు, వర్శిటీ అధికారులు వారికి సర్దిచెప్పి, నివేదిత ృతదేహాన్ని తరలించారు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుందని, ఆమె ఆత్మహత్యకు ఎవరైనా కారణమని తేలితే కఠిన చర్యలుంటాయని రాష్ట్ర విద్యా మంత్రి కేపీ అన్బళగన్ మీడియాకు తెలిపారు.