Police: 120 కి.మీ. వేగంతో వెళుతున్న నయీమ్ మేనకోడలి కారు... ప్రమాదమా? ప్లానా?
- నిన్న కారు ప్రమాదంలో దుర్మరణం
- షాహీనా పేరిట ఎన్నో నయీమ్ ఆస్తులు
- లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు
గ్యాంగ్ స్టర్ నయీమ్ మేనకోడలు సాజీదా షాహీనా (35) నిన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలుకాగా, ఇప్పుడు ఆ మృతిపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి - అద్దంకి జాతీయ రహదారిపై ఓ లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో యాక్సిడెంట్ జరిగినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఓ గృహ ప్రవేశానికి వెళ్లి, ఆపై మిర్యాలగూడకు వెళుతున్న ఆమె ప్రమాదానికి గురైంది.
కాగా, ప్రమాదం జరిగిన సమయంలో కారు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. లారీని ఓవర్ టేక్ చేస్తూ ప్రమాదం జరుగగా, అది ఓవర్ టేక్ సమయంలో జరిగిందా? లేక కావాలనే చేసిన ప్రమాదమా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నయీమ్ ఎన్ కౌంటర్ అనంతరం పలు కేసుల్లో నిందితురాలిగా షాహీనా జైలుకు కూడా వెళ్లి వచ్చింది.
షాహీనా పేరిట ఎన్నో ఆస్తులున్నాయి. ఈ ఆస్తులన్నీ నయీమ్, తన దందాలో భాగంగా షాహీనాను బినామీగా పెట్టి కొనుగోలు చేసినవే. ఈ ఆస్తుల్లో ఎన్నో తగాదాలు ఉన్నాయి. ఆ వివాదాల్లో భాగమైన ఎవరైనా షాహీనాను హతమార్చాలన్న ఉద్దేశంతో ఈ ప్లాన్ చేశారా? అని కూడా పోలీసులు విచారిస్తున్నారు.