Allu Arjun: మా తాతయ్య తీసుకున్న రిస్క్ కారణంగానే ఇవాళ మేమీ స్థాయిలో ఉన్నాం: బన్నీ
- అల్లు రామలింగయ్య గురించి చెప్పిన బన్నీ
- రెండెకరాల పొలం అమ్మేసి మద్రాస్ వెళ్లాడని వెల్లడి
- చిన్న వేషాలతో ప్రారంభించి అగ్రస్థాయికి ఎదిగాడని కితాబు
అల... వైకుంఠపురములో చిత్రం విడుదల నేపథ్యంలో, టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాడు తన తాతయ్య అల్లు రామలింగయ్య తీసుకున్న రిస్క్ తమ జీవితాలను మార్చివేసిందని తెలిపారు. రెండెకరాలం పొలంలో వ్యవసాయం చేసుకునే తన తాతయ్య వీధి నాటకాలు వేస్తూ సినిమా రంగానికి తరలి వెళ్లారని, కానీ మొదట్లో సినిమా అవకాశాలు రాకపోవడంతో తిరిగి సొంతూరు వచ్చేశారని వెల్లడించారు.
"మద్రాసులో ఎక్కడికి వెళ్లి ఎవర్ని అడగాలో తెలియక మా తాతయ్య వెనక్కి వచ్చేశారు. ఈసారి ఉన్న పొలం అంతా అమ్మేసి మద్రాస్ వెళ్లారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తే చిన్న వేషం దొరికింది. కానీ చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడంతో తాతయ్య ఊరికి వచ్చేశారు. అయితే దర్శకులు రవిరాజా పినిశెట్టి గారి తండ్రి శ్రీరామమూర్తి రూ.200 ఇచ్చి మా తాతయ్యను మద్రాసు పంపారు. వేషాలు వచ్చిన సమయంలో మద్రాసులో లేకపోతే ఉపయోగం ఏముంటుందని ఆయన హితవు చెప్పారు. దాంతో మా తాతయ్య మద్రాసులోనే ఉంటూ చిన్న వేషాలతో మొదలుపెట్టి అగ్రశ్రేణికి ఎదిగారు. తాను మద్రాస్ వెళ్లే సమయానికి ఆయనకు పెళ్లయి ఇద్దరు పిల్లలు. ఫ్యామిలీతో సహా మద్రాస్ వెళ్లి సినీ రంగంలో ప్రయత్నాలు చేశారు. నాడు ఒక రైతు చేసిన రిస్క్ మమ్మల్ని ఈ రోజు ఇంత గొప్ప స్థానంలో ఉంచింది. మా తాతయ్య చేసిన కృషిని మా నాన్న కొనసాగించారు" అంటూ వివరించారు.