Jammu And Kashmir: మూడేళ్ల క్రితం సాహస పోలీస్ గా రాష్ట్రపతి పురస్కారం... నేడు ఉగ్రవాదిగా పోలీసులకు చిక్కాడు!

  • డీఎస్పీగా పనిచేసిన దేవీందర్ సింగ్
  • ఉగ్రవాదులను ఢిల్లీకి చేరుస్తుంటే అరెస్ట్
  • వాహనంలో ఐదు గ్రనేడ్లు
  • విచారిస్తున్న పోలీసులు

అతని పేరు దేవీందర్ సింగ్. శ్రీనగర్ లో డీఎస్పీగా విధులు నిర్వహించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా  సాహస పోలీస్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆపై ఏం జరిగిందో ఏమో, ఉగ్రవాదిగా మారిపోయాడు. ఇద్దరు ఉగ్రవాదులను ఆయుధాలతో పాటు న్యూఢిల్లీకి తీసుకుని వెళుతూ, పోలీసులకు పట్టుబడ్డాడు. కశ్మీర్ లోని కుల్గం జిల్లాలోని శ్రీనగర్ - జమ్మూ హైవేపై జరిగింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులైన నవీద్ బాబు, ఆసిఫ్ లను ఢిల్లీకి తీసుకుని వెళుతుండగా, పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

ఇటీవల నవీద్, తన సోదరుడికి ఫోన్ చేయగా, అప్పటి నుంచి అతని లొకేషన్ ను ట్రాక్ చేస్తున్న పోలీసులు, జాతీయ రహదారిపై పట్టుకున్నారు. డీఎస్పీ దేవీందర్ సింగ్ తో పాటు నవీద్, ఆసిఫ్ అనే మరో ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వారి వాహనంలో గ్రనేడ్లు లభించాయి. ఉగ్రవాదులను అతను ఢిల్లీకి ఎందుకు తీసుకుని వెళుతున్నాడన్న విషయాన్ని విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

కాగా, దేవీందర్ సింగ్ ను అరెస్ట్ చేసిన వెంటనే ఆయన ఇంట్లో తనిఖీలు చేయగా, రెండు ఏకే-47 రైఫిళ్లు దొరకడం గమనార్హం. ఇదిలావుండగా, మలేషియా, సిరియా దేశాల్లో పనిచేస్తున్న ముగ్గురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, ఇండియాలో విధ్వంసం సృష్టించేందుకు రాగా, గత వారంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News