Jagan: గన్ కన్నా ముందు జగనన్న వస్తారన్నారు ... మరి జగనన్న ఎక్కడ?: దివ్యవాణి
![](https://imgd.ap7am.com/thumbnail/tn-a966f612f57b.jpg)
- అమరావతి మహిళలపై పోలీసుల తీరు దారుణం
- మహిళల కంటతడి జగన్ కు కనిపించడం లేదా?
- మంత్రి అవంతి ర్యాలీకి ఎలా అనుమతించారు?
అమరావతి మహిళలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణమని సినీ నటి, టీడీపీ నాయకురాలు దివ్యవాణి మండిపడ్డారు. పశువులకన్నా హీనంగా వారిని లాగిపారేశారని అన్నారు. రక్షకభటులే భక్షకభటులైతే సామాన్యుడికి రక్షణ ఎక్కడిదని ప్రశ్నించారు.
మహిళలకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగనన్న వస్తాడని హోం మంత్రి సుచరిత, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారని... అమరావతిలో మహిళలు కంటతడి పెడుతుంటే మీ జగనన్నకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులను వైసీపీ నేతలు కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ర్యాలీకి మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆయన విశాఖ కోసం ర్యాలీ చేస్తే... తాము అమరావతి కోసం ర్యాలీ చేస్తున్నామని చెప్పారు.