Fog: యూపీలో కొంపముంచిన పొగమంచు.. దారి కనిపించక ఢీకొట్టుకున్న వాహనాలు
- ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
- ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టిన మూడు కార్లు, బస్సు
- 12 మందికి తీవ్రగాయాలు
పొగమంచు కొంప ముంచింది. వాహన చోదకులకు దారి కనిపించక పోవడంతో మూడు కార్లు, బస్సు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టాయి. వాటిలో ప్రయాణిస్తున్న మొత్తం 12 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేపై ఈరోజు ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలావున్నాయి.
ప్రస్తుతం ఉత్తర భారతాన్ని దట్టంగా పొగమంచు కమ్మేస్తున్న విషయం తెలిసిందే. చాలా చోట్ల ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగలు కూడా వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొని ఉంది.
ఈ పరిస్థితుల్లో ఎక్స్ ప్రెస్ వేపై వరుసగా మూడు కార్లు వస్తున్నాయి. ముందు బస్సు వెళ్తోంది. పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనం డ్రైవర్ హఠాత్తుగా బ్రేక్ వేయడంతో దీన్ని గుర్తించేలోగానే వెనుక వచ్చే వాహనాలు ఒకదాన్ని మరొకటి ఢీకొట్టాయి.
దీంతో 12 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రమాదాలు జరుగుతున్నందున వాహన చోదకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.