oman: ఒమన్ సుల్తాన్ ఖబూస్ కన్నుమూత.. వారసుడి ఎంపికపై ఆసక్తి
- పశ్చిమాసియా దేశాల్లో సుదీర్ఘ కాలం పరిపాలించిన నేత ఖబూస్
- ఒమన్‌ను ఆధునికత వైపు నడిపించిన సుల్తాన్
- పెద్దపేగు కేన్సర్‌తో మృతి
పశ్చిమాసియా దేశాల్లో సుదీర్ఘ కాలం పరిపాలించిన నేతగా గుర్తింపు పొందిన 'ఒమన్' సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్ అల్ సయిద్ (79) నిన్న కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన పెద్దపేగు కేన్సర్‌తో బాధపడ్డారు. 1970లో తన తండ్రి నుంచి ఒమన్ సుల్తాన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సుల్తాన్‌గా కొనసాగారు.
ఒమన్‌ని ఆధునికత వైపు నడిపించిన నేతగా పేరు తెచ్చుకున్న సుల్తాన్ ఖబూస్ అవివాహితుడు కావడంతో ఆయనకు వారసులు ఎవరూ లేరు. ఒమన్ రాజ్యాంగం ప్రకారం సుల్తాన్ పదవి ఖాళీ అయిన మూడు రోజుల్లోగా కొత్తవారు ఆ పదవిని స్వీకరించాలి.
రాయల్ ఫ్యామిలీ కౌన్సిల్‌లో ఉన్న సుమారు 50 మంది సభ్యులు మూడు రోజుల్లోగా కొత్త సుల్తాన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. లేదంటే రాజ కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఖబూస్ రాసిన లేఖలో పేర్కొన్న వ్యక్తిని సుల్తాన్‌గా నియమిస్తారు. దాదాపు 80 మంది పోటీలో ఉన్నట్లు, వారిలో అసద్ బిన్ తారిఖ్ అనే నేత పోటీలో ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది.