Andhra Pradesh: ఒకేసారి గుంపుగా రావడం వల్ల అడ్డుకున్నాం.. తుళ్లూరు ఘటనపై ఎస్పీ వివరణ!
- రాజధానిలో కొనసాగుతున్న ఆందోళనలు
- తుళ్లూరులో మహిళాగ్రహం
- పోలీసులు మహిళలపై దాడి చేశారంటూ కథనాలు
- స్పందించిన ఎస్పీ విజయరామారావు
రాజధాని అమరావతి కోసం మహిళలు సైతం రోడ్డెక్కి నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అయితే తుళ్లూరు వద్ద మహిళలపై పోలీసులు దాష్టీకం చెలాయించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించి ఘటనను సుమోటోగా స్వీకరించింది. అయితే, తాము ఎవరిపైనా దాడి చేయలేదని ఎస్పీ విజయరామారావు స్పష్టం చేశారు.
తుళ్లూరు ఘటనపై స్పందిస్తూ, శాంతిభద్రతలను కాపాడడం తమ విధి అని, చట్టవిరుద్ధంగా గుంపుగా రావడంతో వారిని నిలువరించామని వెల్లడించారు. అప్పటికే అక్కడ 30 పోలీస్ చట్టం, 144 సెక్షన్ అమలులో ఉన్నాయని ప్రకటించామని, అయినప్పటికీ ఒకేసారి అంతమంది వచ్చారని వివరించారు. కానీ తాము దాడి చేసినట్టు ఫేక్ వీడియోలతో ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరు ఘటనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.