Tirumala: తిరుమల వెంకన్న ఆలయంలో నగల మాయం నిజమే... నిజాన్ని తేల్చిన విచారణ కమిటీ!
- రెండేళ్ల క్రితమే ఫిర్యాదు
- విచారించి తేల్చిన కమిటీ
- నాటి ఏఈఓ శ్రీనివాసులుపై ఆరోపణలు
తిరుమల శ్రీవారి ఆలయంలో లక్షలాది రూపాయల విలువైన ఆభరణాలు మాయమైన మాట వాస్తవమేనని అధికారుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించి ఆరు నెలలు కాగా, ఇప్పుడు బయటకు వచ్చింది. టీటీడీ ఏఈఓగా శ్రీనివాసులు ఉన్న సమయంలో ఆభరణాలు కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదులపై బోర్డు ఓ విచారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఎంక్వయిరీ చేసి, నగల మాయం నిజమేనని తేల్చింది.
శ్రీనివాసులు ట్రెజరీ ఏఈఓగా ఉన్న సమయంలో నగలు మాయం అయ్యాయని విచారణ కమిటీ పేర్కొంది. 5 కిలోల బరువున్న వెండి కిరీటం, బంగారు నాణాలు, 2 ఉంగరాలు, ఓ నక్లెస్ కనిపించకుండా పోయాయని, వీటి విలువ దాదాపు రూ. 7.36 లక్షలని అధికారులు తేల్చారు. అయితే, ఈ కేసులో శ్రీనివాసులు దోషిగా నిరూపితమైన తరువాత 2018 నుంచే ఆయన వేతనం నుంచి నెలకు రూ. 25 వేల చొప్పున రికవరీ చేస్తున్నారని విచారణ కమిటీ వెల్లడించడం గమనార్హం.