Jagan: చాలా వారాల తరువాత నేడు కోర్టుకు జగన్... మరో కేసులో విజయమ్మ, షర్మిల కూడా!

  • అక్రమాస్తుల కేసులో జగన్ పై విచారణ
  • సీఎం అయిన తరువాత కోర్టుకు రాని జగన్
  • మినహాయింపు లేదని స్పష్టం చేసిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల నేడు హైదరాబాదులో వేర్వేరు కోర్టులకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా జగన్ హైదరాబాద్, నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రతి శుక్రవారం హాజరు కావాల్సి వుండగా, ఏపీ సీఎం అయిన తరువాత పాలనపరమైన వ్యవహారాలతో బిజీగా ఉన్నందున జగన్ కోర్టుకు గైర్హాజరవుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇంక మినహాయింపు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేయడంతో నేడు ఆయన కోర్టుకు హాజరు కానున్నారు.

సీఎం హోదాలో కోర్టుకు రావాలంటే, భద్రతా కారణాలు, బందోబస్తు ఖర్చులను కారణాలుగా చూపుతూ, జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించగా, న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆయన నేడు కోర్టుకు హాజరు కానున్నారు.

ఇదే సమయంలో యాదృచ్చికంగా, నేడే వైఎస్ విజయమ్మ, షర్మిలలు మరో కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ కోర్టులో హాజరు కావాల్సిన పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో... అంటే 2012లో అనుమతులు లేకుండా వరంగల్ జిల్లా పరకాలలో సభ నిర్వహించడం ద్వారా, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని వీరిపై కేసు నమోదైంది.

ఈ కేసులో వారు ఇంతవరకూ విచారణకు హాజరు కాలేదు. దీంతో వారికి సమన్లు జారీ కాగా, నేడు కోర్టుకు హాజరు కావాల్సి వుంది. ఇదే కేసులో కొండా మురళి, కొండా సురేఖ దంపతులు కూడా కోర్టుకు రానుండడంతో, రెండు కోర్టుల వద్దా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Jagan
CBI
Court
Case
YS Vijayamma
Sharmila
  • Loading...

More Telugu News