Posani Krishna Murali: మా ఇంట్లో పనిచేసే ముగ్గురు అమ్మాయిలకు సెల్ ఫోన్లు ఉన్నాయి: పృథ్వీపై విరుచుకుపడిన పోసాని
- రైతులను పెయిడ్ ఆర్టిస్టులన్న పృథ్వీకి పోసాని క్లాస్
- కమ్మవాళ్లను రోడ్డుమీదకు లాగావంటూ ఆగ్రహం
- జగన్ పేరు చెడగొట్టడానికి పుట్టారంటూ మండిపాటు
రాజధాని రైతులను పెయిడ్ ఆర్టిస్టులని వ్యాఖ్యానించిన వైసీపీ నేత పృథ్వీపై వైసీపీకే చెందిన నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎంతో గౌరవంగా బతికే కమ్మవాళ్లను రోడ్డుపైకి ఈడ్చాడంటూ మండిపడ్డారు. "కమ్మవాళ్లు ఆత్మగౌరవంతో వాళ్ల బతుకు వాళ్లు బతుకుతున్నారు. కానీ నువ్వు వాళ్లను రోడ్డుమీదకు లాగావు. పృథ్వీ నువ్వే వాళ్లను రోడ్డుమీదకు ఈడ్చావు. వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులా. రాజధాని వస్తుందని పంటలు పండే భూములు ప్రభుత్వానికి ఇచ్చేశారు. వాళ్లను నువ్వు పెయిడ్ ఆర్టిస్టులంటున్నావు.
రైతులంటే మోకాళ్ల దాకా పొలంలో దిగి పనులు చేసుకుంటూ, చెట్టు కింద అన్నం తిని వెళ్లిపోయేవాళ్లా. రైతులు చొక్కా ప్యాంట్లు వేసుకోరా? ఆడవాళ్లు ఖరీదైన బట్టలు వేసుకోరా, బంగారు గాజులు వేసుకోరా? మూడు పంటలు పండే భూములు ఇచ్చినవాళ్లు ఆమాత్రం బంగారం వేసుకోకూడదా? సెల్ ఫోన్ లో మాట్లాడకూడదా? మా ఇంట్లో పనిచేసే ముగ్గురు పనమ్మాయిలకు ముగ్గురికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆటో వాడి దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉంటాయి.
నువ్వు అన్నది ఎవర్నో చెప్పాలి. అమరావతిలో ఉన్న రైతుల్ని అన్నావా, అమరావతిలో బతుకుతున్న కమ్మవాళ్లను అన్నావా? కమ్మ ఆడపడుచుల్ని అన్నావా, లేక అందరు రైతుల్ని అన్నావా? జగన్ ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేశారు. ఆయన ఏనాడు ఏ కులం పేరెత్తి ఒక్కర్నీ కూడా పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడాయన పేరు చెడగొట్టడానికి పుట్టారు మీరు. సిగ్గుపడండి" అంటూ మండిపడ్డారు. పృథ్వీ ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని అన్నారు. అలా చెప్పకపోతే విపక్షాలు దీన్ని ఉపయోగించుకుంటాయని తెలిపారు. "మీరు ఇలా వాగుతూ ఉంటే ప్రతిపక్షాలు అడ్వాంటేజ్ గా తీసుకుంటాయి. మన ప్రతిపక్ష నేత ఎలాంటివాడో తెలుసుకదా!" అంటూ హెచ్చరించారు.