Nara Rohit: రైతుల పోరాటం వృథా కాదు.. త్వరలో నేనూ పోరు బాట పడతా: నారా రోహిత్
- విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ జీవచ్ఛవంలా మారింది
- రాజధానికోసం భూములిచ్చిన రైతుల త్యాగాన్ని వెలకట్టలేం
- వారు చేస్తోన్న పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై సినీ నటుడు నారా రోహిత్ సామాజిక మాధ్యమంగా స్పందించారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. 23 రోజులుగా వారు చేస్తోన్న న్యాయమైన పోరాటం రానున్న తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. రాజధానికోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిదని ప్రశంసిస్తూ ఫేస్ బుక్ లో సందేశాన్ని పెట్టారు.
రైతులు పెద్ద మనసుతో భూములిచ్చారని.. వారి త్యాగంతోనే అమరావతి రాజధానిగా ప్రాణం పోసుకుందన్నారు. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ జీవచ్ఛవంలా మారిందన్నారు. ‘రైతుల ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా.. మొక్కవోని దీక్షతో రైతులు ముందడుగు వేస్తున్నారు. వారి పోరాటం వృథా కాదు. త్వరలోనే రైతులతో కలిసి పోరాటంలో పాలు పంచుకుంటాను’ అని రోహిత్ పేర్కొన్నారు.