Jagan: అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన జగన్.. 75 శాతం హాజరును ఈ ఏడాది మినహాయిస్తున్నామన్న సీఎం

  • ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలోకి రూ. 15 వేలు జమ
  • వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం
  • సిలబస్ ను కూడా మార్చే కార్యక్రమం చేస్తున్నాం

మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల చదువు తల్లికి భారం కాకూడదని అన్నారు. పిల్లలకు మనమిచ్చే ఆస్తి విద్య అని చెప్పారు.

తల్లులను ఆదుకునేందుకే అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఈ పథకం కింద రూ. 15 వేలు జమచేస్తున్నామని చెప్పారు. దాదాపు  43 లక్షల మంది తల్లులకు ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఏటా రూ. 15 వేల చొప్పున అందిస్తామని తెలిపారు.

ఈ ఏడాదికి 75 శాతం హాజరు నిబంధనను ఈ ఏడాదికి అమలు చేయడం లేదని... వచ్చే ఏడాది నుంచి నిబంధనను తప్పనిసరి చేస్తామని జగన్ తెలిపారు. మేనిఫెస్టోలో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు అని చెప్పినా... ఇంటర్ వరకు పొడిగించామని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం దిశగా అడుగులు వేస్తున్నామని... వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరుగుతుందని తెలిపారు.

వచ్చే ఏడాది ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నామని... ఆ తర్వాత ఒక్కో ఏడాదికి ఒక్కో తరగతిని పెంచుకుంటూ పోతామని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని... వాటన్నింటినీ అధిగమించాలని అన్నారు. సిలబస్ ను కూడా మార్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు.

Jagan
YSRCP
Ammavodi
  • Loading...

More Telugu News