New Delhi: ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.. ఒకరి మృతి
- మంటల్లో చిక్కుకున్న ప్రింటింగ్ ప్రెస్
- ఉత్తర ఢిల్లీలోని పత్సార్ గంజ్ పారిశ్రామిక వాడలో ఘటన
- నెల రోజుల వ్యవధిలో దేశ రాజధానిలో నాలుగో ప్రమాదం
వరుస అగ్ని ప్రమాదాలతో ఢిల్లీ వాసులు హడలెత్తిపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో నాలుగో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారు జామున ఉత్తర ఢిల్లీలోని పత్సార గంజ్ పారిశ్రామిక ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడ ఉన్న ఓ ప్రింటింగ్ ప్రెస్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈనెల ఒకటో తేదీన పీరాగి ప్రాంతంలోని ఓ బ్యాటరీ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అంతకుముందు డిసెంబరు నెలలో రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. అనాజ్ మండీలోని ప్లాస్టిక్ వస్తువులు తయారుచేసే ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ప్రమాదంలో 43 మంది చనిపోయారు. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు.
అక్కడికి వారం రోజులు గడవక ముందే ఢిల్లీలోని మంద్క ప్రాంతంలోని ప్లైవుడ్ గోదాములో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. 21 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
ఇలా వరుసగా అగ్ని ప్రమాదాలు చేటు చేసుకుంటూ ఉండడం, పలువురు మృత్యువాత పడుతుండడంతో స్థానికులు హడలిపోతున్నారు. ఎటువంటి భద్రతా ప్రమాణాలు లేకుండా కర్మాగారాలు, సంస్థలు నడుపుతుండడం వల్లే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతోందని విమర్శిస్తున్నారు.