Test Matches: ఇలా చేసుకుంటూ పోతే టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుంది: జయవర్ధనే
- టెస్ట్ క్రికెట్ ను నాలుగు రోజులకు కుదించే యోచనలో ఐసీసీ
- వ్యతిరేకిస్తున్న పలువురు క్రికెట్ దిగ్గజాలు
- దీనిని వ్యతిరేకిస్తున్నానన్న జయవర్ధనే
టెస్టు మ్యాచులను ఐదు రోజుల నుంచి నాలుగు రోజులకు కుదించాలని ఐసీసీ భావిస్తున్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్ ను ఒక రోజు కుదించడం వల్ల చాలా సమయం మిగులుతుందని... దీన్ని టీ20 వంటి లాభదాయకమైన ఫార్మాట్ కు ఉపయోగించుకోవచ్చనేది ఐసీసీ అభిప్రాయం. మరోవైపు, ఈ ప్రతిపాదనను క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రిక్కీ పాంటింగ్, షోయబ్ అఖ్తర్ వంటివారు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా వీరి సరసన శ్రీలంక మాజీ స్టార్ బ్యాట్స్ మెన్ జయవర్ధనే కూడా చేరాడు.
టెస్ట్ క్రికెట్ ను పాప్యులర్ చేయాలనే భావనతో డే-నైట్ టెస్టులను రూపొందించారని... వెంటనే నాలుగు రోజుల టెస్టులంటున్నారని జయవర్ధనే మండిపడ్డారు. లాభాల కోసం టెస్ట్ ఫార్మాట్ ను ఇలా మార్చుకుంటూ పోతే... చివరకు టెస్ట్ క్రికెట్ చచ్చిపోతుందని అన్నాడు. టెస్ట్ క్రికెట్ స్వరూపాన్ని మార్చడానికి తాను పూర్తిగా వ్యతిరేకమని చెప్పాడు.