Divyavani: విశాఖలోని తమ భూములు పోతాయన్న స్వార్థంతో సినిమా స్టార్లు ముందుకు రావడంలేదు: దివ్యవాణి ఫైర్
- రైతుల గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు
- మహిళా మంత్రులు సభ్యతతో వ్యవహరించాలి
- రైతుల ఉద్యమానికి స్టార్లు మద్దతు ఇవ్వాలంటూ పిలుపు
ప్రజల మధ్యకు రావడానికి ఎందుకు భయపడుతున్నారంటూ టీడీపీ మహిళా నేత దివ్యవాణి వైసీపీ నేతలను ప్రశ్నించారు. ఇవాళ మీసేవ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చారు, పేదవాళ్లకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను మూసేయించారు. ఆ క్యాంటీన్లకు వైసీపీ రంగులు వేసుకుంటూ మీ కార్యాలయాలుగా వాడుకుంటున్నారు. పేదల కడుపులో సున్నం కొడుతున్నారు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు మీద కక్షతో ఐదు కోట్ల మంది ఆంధ్రుల కన్నీళ్లను రుచిచూడాలని ప్రయత్నించవద్దని హితవు పలికారు.
"వైఎస్ విజయమ్మ గారిని, షర్మిల గారిని, భారతి గారిని మేం ఒకటే అడుగుతున్నాం... నాడు ఓట్లు అడగడానికి ఊరూరా తిరిగారే, ఇప్పుడు రైతుల గోడు కనిపించడం లేదా, వాళ్లు భూములిచ్చిన త్యాగాలు గుర్తించకుండా మీ పార్టీ నేతలు వాళ్ల త్యాగాలను అపహాస్యం చేస్తున్నారు. వారికి న్యాయం చేయకపోగా, రైతులంటే పంచెలు కట్టుకునే ఉండాలని అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు" అంటూ మండిపడ్డారు.
"అమ్మా వాసిరెడ్డి పద్మగారూ, కులాల పిచ్చి ఉంది మా చంద్రన్నకు కాదమ్మా! అయ్యా జగన్ రెడ్డి గారూ కులాల పిచ్చి ఉన్నది మా పార్టీకి కాదు. దయతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆవేదనను అర్థం చేసుకోండి. చంద్రబాబు పథకాలను కొనసాగించి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. అధికారంలో ఉండి కూడా విపక్షంపై నిత్యం విమర్శలు చేయడం ఆపండి. మహిళా మంత్రులు కూడా సభ్యతతో వ్యవహరించాలి.
ఇవాళ స్కూళ్లలో తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియంతో పాటు వైఎస్సార్ మీడియమా అని కూడా అడుగుతున్నారు. సినిమా రంగంపైనా నేడు ప్రజలు ఆవేదనతో ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో ప్రజలకు చిన్న సమస్య వచ్చినా సినీ రంగాలు కదిలి వస్తున్నాయి. కానీ ఇక్కడి స్టార్లు మాత్రం విశాఖలో ఉన్న తమ భూములు పోతాయన్న స్వార్థంతో ముందుకు రావడంలేదు. ప్రేక్షక దేవుళ్లు అని చెప్పుకుంటూ రైతన్నల ఆవేదనకు సినీ రంగం నుంచి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వడంలేదు. ఇది పార్టీలకు సంబంధించిన సమస్య కాదు. దయతో రైతన్నలను ఆదుకునేందుకు ముందుకు రండి" అంటూ దివ్యవాణి పిలుపునిచ్చారు.