Telangana: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- జనవరి 22న పోలింగ్
- 25న ఓట్ల లెక్కింపు
- ఉత్తమ్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి వెల్లడించారు. జనవరి 22న పోలింగ్ ఉంటుందని, జనవరి 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. కాగా, జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని పేర్కొన్నారు. జనవరి 11న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తామని, జనవరి 14లోపు నామినేషన్ల ఉపసంహరణకు వీలుంటుందని తెలిపారు.
తెలంగాణలో కరీంనగర్ మినహా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లోని 325 కార్పొరేటర్, 2727 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా, మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే నోటిఫికేషన్ జారీ చేయరాదంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దాంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమైంది.