Nandini: ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందంటూ... అనంతపురం జిల్లాలో సచివాలయ ఉద్యోగిని నందిని ఆత్మహత్య!
- అనంతపురం జిల్లాలో ఘటన
- కణేకల్లులో కార్యదర్శిగా పనిచేస్తున్న నందిని
- నిన్న ఉదయం గదిలో ఉరేసుకుని సూసైడ్
తనపై పని ఒత్తిడి విపరీతంగా ఉందన్న మనస్తాపంతో ఏపీ సచివాలయం కార్యదర్శిగా పని చేస్తున్న యువతి నందిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా కణేకల్లులో కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హిందూపురం పట్టణానికి చెందిన కాలప్ప, పద్మల ఏకైక కుమార్తె నందిని, గత సంవత్సరం సెప్టెంబర్ లో సచివాలయ ఉద్యోగినిగా ఎంపికైంది. ఆమెకు కణేకల్లు 4వ సచివాలయం కార్యదర్శిగా ఉద్యోగం రాగా, తన సహచరులు లలిత, శాంతి, వరలక్ష్మితో కలిసి ఓ అద్దెగదిలో ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తుండేది.
ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం బాగాలేకపోగా, 20 రోజులు సెలువు పెట్టి, అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆపై శ్రీకాళహస్తిలో ఉద్యోగులకు శిక్షణ ఇస్తుండటంతో, నాలుగు రోజుల క్రితం అక్కడికి వెళ్లి, తిరిగి కణేకల్లు చేరుకుంది. స్నేహితురాళ్లతో బాగానే ఉన్న ఆమె, నిన్న మిగతావాళ్లు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు, ఆమె నోట్ బుక్ లో నమూనా రాజీనామా లేఖను స్వాధీనం చేసుకున్నారు. పని ఒత్తిడి పెరగడం, ఆరోగ్యం సహకరించక పోవడంతో సూసైడ్ చేసుకుంటున్నట్టు నందిని రాసుకుంది. ఘటనా స్థలిని సందర్శించిన స్థానిక తహసీల్దారు ఉషారాణి, ఎంపీడీఓ తదితరులు కేసు దర్యాఫ్తును పర్యవేక్షిస్తున్నారు.